లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) అమలు ఇక లోక్సభ ఎన్నికల తర్వాతే ఉండనున్నట్లు తెలుస్తోంది. నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో ఇప్పుడు సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. మార్చి 31వ తేదీలోగా క్రమబద్ధీకరణను పూర్తి చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గడిచిన నెలలో అధికారులకు చెప్పిన విషయం తెలిసిందే.
అయితే తక్కువ వ్యవధిలో పూర్తి చేయాలంటే గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను మార్చాలని, ఆ ప్రక్రియను కుదిస్తూ ముసాయిదాను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. వీటిపై ఉత్తర్వుల జారీలో జాప్యం జరగడం, ఈలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకుని నిర్వహించాలన్న సూచనలను అధికారులు పరిశీలించినా ఆ దిశగా మాత్రం ముందడుగు పడటం లేదు. సమయం కూడా కేవలం 11 రోజులు మాత్రమే ఉండటంతో దరఖాస్తుల పరిశీలనకు, సొమ్ము చెల్లించేందుకు నోటీసులు పంపిన తర్వాత కనీసం వారం నుంచి పది రోజుల గడువు ఇవ్వాల్సి ఉంటుందని, ఈ క్రమంలో ప్రక్రియ నిర్వహించటం సాధ్యం కాదని ఓ అధికారి తెలిపారు.