మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని గుత్తేదారు సంస్థ ఎల్‌అండ్‌టీ చేతులెత్తేసింది. దీంతో ఇప్పుడు ఆ బ్యారేజీ పునరుద్ధరణ పనులపై సందిగ్ధం నెలకొంది. వచ్చే ఏడాది వర్షాకాలంలోగా పనుల పూర్తి కష్టమేనని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పనులు పూర్తి చేయకుండా నీటిని నిల్వచేస్తే బ్యారేజీకి ప్రమాదం వాటిల్లే అవకాశముందని ఇప్పటికే నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ సంస్థకు మళ్లీ లేఖ రాయాలని నీటిపారుదల శాఖ నిర్ణయింయినట్లు సమాచారం. నిర్మాణం పూర్తయిన తక్కువ సమయంలోనే దెబ్బతిన్న బ్యారేజీ పనులను గుత్తేదారు సంస్థ పూర్తిచేయని నేపథ్యంలో పనులను వారే చేయాలంటూ లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ సంస్థ స్పందించకపోతే ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయానికి వస్తామని నీటిపారుదల శాఖ భావిస్తోంది.
నిర్మాణం పూర్తయిన తర్వాత రెండేళ్ల వరకు ఏదైనా సమస్య వస్తే కాంట్రాక్టర్‌దే బాధ్యత అని ఒప్పందంలో ఉంది. ఈ క్రమంలో అక్టోబరులో బ్యారేజీలోని కొంత భాగం కుంగి, పియర్స్ దెబ్బతిన్నప్పుడు పునరుద్ధరణకు అయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరిస్తుందని నీటిపారుదల శాఖ అధికారికంగా ప్రకటించగా ఎల్‌అండ్‌టీ కూడా తమదే బాధ్యత అని పేర్కొంది. కానీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తమ గడువు ముగిసిందని ఇప్పుడు ఆ సంస్థ చెబుతోంది. నీటిని మళ్లించేందుకు కాఫర్‌డ్యాం నిర్మాణం చేపట్టాలంటే రూ.55 కోట్లవుతుందని, ఇందుకు ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోవాలని ఆ సంస్థ లేఖ రాసింది.