హైదరాబాద్ మహానగరం నలుమూలలా.. ఎక్కువ ప్రాంతాలకు ఉపయోగపడేలా మెట్రోను విస్తరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో నగరంలో మెట్రోరైలు విస్తరణపై కాస్త క్లారిటీ వచ్చింది. గతంలో ప్రతిపాదించిన కొన్నింటిని నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చిన సర్కార్.. మరికొన్నింటిని కొనసాగిస్తూ కొత్తగా కొన్ని మార్గాల్లో పొడిగించాలని, ఎక్కువ ప్రాంతాలను కలిపేలా మార్గాలను నిర్ణయించింది.
ఈ క్రమంలో నగరంలో 5 మార్గాల్లో 76 కి.మీ. మేర మెట్రో విస్తరణ జరగనుంది. అందులో ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు మెట్రో విస్తరించే యోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. కొత్తగా విస్తరించే మార్గాల్లో రాయదుర్గం నుంచి గచ్చిబౌలి, విప్రో, అమెరికన్ కాన్సులేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 12 కి.మీ. నిర్మించనున్నారు. ఇది గనుక అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాల నుంచి ఊరట లభిస్తుంది. ఐటీ కారిడార్కు ఇప్పటివరకు సరైన ప్రజారవాణా లేదు. రాయదుర్గం వరకే మెట్రో ఉంది. దీంతో ఇక్కడి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరుకోవడానికి ఉదయం గంటన్నరపాటు ట్రాఫిక్‌లో నరకంగా ఉంటోంది. ఈ క్రమంలో ఈ మార్గంలో మెట్రో వస్తే ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కులుగుతుందని అధికారులు భావిస్తున్నారు.