భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి కీలక సూచనలు..!

-

రాష్ట్రంలో భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అప్రమత్తం చేశారు. డాక్టర్లు, సిబ్బందికి వర్షాలు తగ్గే వరకూ సెలవులు ఇవ్వొద్దని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, డీహెచ్ రవిందర్ నాయక్‌ను ఆదేశించారు. డాక్టర్లు, స్టాఫ్ అందరూ హెడ్‌ క్వార్టర్స్‌‌లోనే ఉండాలని, ప్రతి ఒక్కరూ డ్యూటీలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్‌ దగ్గరగా ఉన్న గర్భిణులను ముందే హాస్పిటళ్లకు తరలించి, వెయిటింగ్ రూమ్స్‌ కేటాయించాలని ఆదేశించారు.

అలాగే గర్భిణికి, ఆమెతో వచ్చిన కుటుంబ సభ్యులకు భోజన వసతి కల్పించాలని ఆదేశించారు. అంబులెన్స్ సర్వీసులు అన్ని చోట్ల అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మెడిసిన్, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పేషెంట్లకు అందించే ఆహారం, తాగునీరు విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు తగ్గిన తర్వాత దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన జ్వరాలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని మంత్రి హెచ్చరించారు. ఈ విషయాన్ని ముందే ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పించాలని, పంచాయతీరాజ్‌, మునిసిపల్ శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల హాస్టళ్లలో స్టూడెంట్స్‌కు అందజేసే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గురుకులాల్లో పిల్లలకు అందించే భోజనం విషయంలోనూ జాగ్రత్తలు పాటించేలా సంబంధిత శాఖ అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు మంత్రి దామోదర రాజనర్సింహా.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version