మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు వెళ్లే రెండో వ్యక్తి జగదీశ్ రెడ్డేనని అన్నారు. భద్రాద్రి థర్మల్ విద్యుత్కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే తనపై జగదీశ్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజిలెన్స్ విచారణ, సిట్టింగ్ జడ్జితో ఎంక్వయిరీ తర్వాత జగదీష్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు.
మద్య నిషేధ సమయంలో అక్రమ మద్యం అమ్మి జైలుకు వెళ్లిన జగదీశ్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్యారాగన్ స్లిప్పర్లు వేసుకున్న వ్యక్తికి ఇవ్వాళ వేల కోట్ల ఆస్తులు ఫామ్ హౌస్లు ఎట్లొచ్చినయో.. తెలంగాణ ప్రజలకి చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారని పేర్కొన్నారు.