ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి.. ఉమ్మడి ఏపీ భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీని ఆదుకోవాలని ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌లో హామీ ఇచ్చారని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. విభజన వేళ ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
అంతకుముందు దిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం గురించి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి దిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులు చేపట్టాలనుకుంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఏపీ భవన్‌కు చెందిన ఆస్తులను పరిశీలించామని కోమటిరెడ్డి చెప్పారు. దిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ వివరాలను సీఎంకు వివరిస్తానని వెల్లడించారు. ఇప్పటికే నిర్మాణం ఆలస్యమైందని.. ఉమ్మడి ఏపీ భవన్ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం లేదని మంత్రి స్పష్టం చేశారు.