కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రులు సమీక్షించారు. మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. అర్హులంతా ఆరు గ్యారెంటీల పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ రశీదు తీసుకోవాలన్నారు. అర్హుల ఎంపిక విషయంలో ఎలాంటి పైరవీలకు తావు ఉండదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
కాగా ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రజా పాలన ఉంటుందన్నారు రాష్ట్ర రోడ్డు భవనాల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి. గత పాలకుల అసమర్థ పాలనతోనే ప్రతిశాఖ వేల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ కు మాత్రమే నీళ్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకుల ద్వారా నిధులు తీసుకువచ్చి శంకుస్తాపన చేసిన వాటిని తుంగలో తొక్కి లక్షల కోట్ల నిధులను దారి మళ్లీంచారని మండిపడ్డారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతికే విధంగా ఇందిరమ్మ పాలన కొనసాగుతుందని మంత్రి కోమటిరెడ్డి భరోసానిచ్చారు.