కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో కన్ఫ్యూజన్ అవసరం లేదని, తమ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావేనని స్పష్టం చేశారు. తామంతా కలిసి మంచి రోజు ఉన్నందువల్ల సోమవారం రోజున నామినేషన్ వేయించామని చెప్పారు. పార్టీ అధిష్టానం అభ్యర్థిపై అతి త్వరలో ప్రకటన చేస్తుందని వెల్లడించారు. కరీంనగర్లో మీడియా సమావేశం నిర్వహించిన పొన్నం ఈ మేరకు మాట్లాడారు.
మొదటి దశ ఓటింగ్ తర్వాత మోదీ వెన్నులో వణుకు పుడుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని స్వయంగా ప్రధానమంత్రి అనడం విచారకరం. పాంచ్ న్యాయ్, కులగణన వంటివి బీజేపీకి రుచించడం లేదు. ప్రధాని స్థాయిలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహించాల్సిన మోదీ నీచంగా మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి. మేము అన్నివర్గాలకు న్యాయం చేసే విధంగా పాలించాం. 80 శాతం ఉన్న హిందువులకు మా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందా..? ఏకపక్ష మెజార్టీ మీకు ఇచ్చినా.. మీరు హిందువులకు ఏం చేశారు? అని బీజేపీపై విమర్శలు గుప్పించారు.