అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. జనవరి 1 నుండి జనవరి 31 వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాల సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో నేడు మంత్రి రవాణా శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రత మాసంలో భాగంగా వర్క్ షాప్ లు, సెమినార్లు, డ్రైవర్లకు, స్కూలు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, కంటి చెకప్ క్యాంపులు నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న 97 ఆర్టీసీ డిపోలు, 62 రవాణా కార్యాలయాల్లో భద్రతా నియమాలతో అవగాహన కల్పిస్తూ బ్యానర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
రోడ్డు భద్రత మాసంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ లు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. అలాగే ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పై అవగాహన కల్పించాలని.. రోడ్డు భద్రతపై ఆర్టీసీ రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.