తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పదో రోజు కొనసాగుతున్నాయి. పద్దులపై శాసనసభలో ఇవాళ చివరి రోజు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ తెలంగాణ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ల్యాండ్ డీలింగ్స్‌లో బిజీగా ఉన్నారని.. ఠాణాల్లో సెటిల్మెంట్లు నడుస్తున్నాయని అక్బరుద్దీన్ ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో నేరాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉందని అన్నారు. ఎవరు నేరస్థులు, ఎవరు కాదనేది పోలీసులకు తెలుసని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిలు ఎందుకు చెల్లించట్లేదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను కాంగ్రెస్ కొనసాగిస్తోందని విమర్శించారు. పాతబస్తీకి సంబంధించి నష్టాలు వస్తున్నట్లు పదేపదే చెబుతారన్న ఆయన.. విద్యుత్ కొనుగోళ్ల ధరలపై ఎవరూ ప్రశ్నించట్లేదని అన్నారు. గతంలో కంటే విద్యుత్ ధరలను పెంచి కొనుగోళ్లు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ఇబ్రహీంబాగ్‌లో హైటెన్షన్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఐదెకరాలు కావాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.