కాంగ్రెస్ పార్టీని వీడి భాజపాలో చేరితే తనకు మద్దతిస్తారా? అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, నాయకులను అడిగినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని తన నివాసంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో నాంపల్లి, మర్రిగూడ, చండూరు మండలాల ముఖ్య కార్యకర్తలు, నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. తన రాజకీయ భవిష్యత్తు కార్యకర్తల చేతుల్లోనే ఉందన్న రాజగోపాల్‌రెడ్డి…కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకే తాను భాజపాలో చేరుతున్నానని స్పష్టం చేసినట్లు సమాచారం.
‘‘విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 2015లో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి అధికార తెరాసపై గెలిచాను. అప్పటినుంచి మా సోదరుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కోసమే ఓ న్యూస్‌ఛానల్ ప్రారంభించాను. అయినా మాకు పార్టీలో తగిన గుర్తింపు దక్కలేదు. 2018 అనంతరం సీఎల్‌పీ పదవీ కోసం ప్రయత్నిస్తే దానిని ఇతరులకు ఇచ్చారు. అయినా పార్టీకోసమే పనిచేశాను. గతేడాది పీసీసీ అధ్యక్ష పదవి అడిగినా ఇవ్వలేదు. పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడినా అధిష్ఠానం సరైన సమయంలో స్పందించలేదు. ఇప్పుడు నా నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు. ఉపఎన్నికలు జరిగిన నియోజకవర్గాలకు భారీగా నిధులు వస్తున్నాయి. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నేను రాజీనామా చేయాలి. అప్పుడు మీరంతా నా వెంట వస్తారా? నన్నెం చేయమంటారు?’’ అని రాజగోపాల్‌రెడ్డి పార్టీ ముఖ్యనాయకులను అడిగినట్లు సమాచారం.
వారు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లోనే ఉండి తెరాసపై పోరాడాలని కొంతమంది సూచించగా… నియోజకవర్గంలో భాజపా సంస్థాగతంగా బలంగా లేదని, ఈ పరిస్థితుల్లో పోటీపై పునరాలోచించుకోవాలని మరికొందరు చెప్పినట్లు తెలిసింది. మరికొంతమంది మీ నిర్ణయం మేరకు పనిచేస్తామని చెప్పగా.. వారం రోజుల్లో మరోసారి సమావేశం అవుదామని చెప్పి పంపించారని ఓ మండల పార్టీ అధ్యక్షుడు వెల్లడించారు.