తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఈ నెల 11వ తేదీ నుంచి మొదలైన నామినేషన్ల ప్రక్రియ 18వ తేదీతో ముగుస్తుంది. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీలుగా పోటీచేసేందుకు అర్హులైన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు రెండు ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రేపటితో గడువు ముగుస్తున్నందున నామినేషన్లు దాఖలు చేయాలనుకునే అభ్యర్థులకు ఇవాళ, రేపు మాత్రమే సమయం ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా.., రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ సూచన మేరకు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన ధ్రువపత్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించనుంది. నామినేషన్ల గడువు ముగియనుండడంతో అభ్యర్థుల ప్రకటన ఇవాళ కచ్చితంగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.