తెలంగాణలో కొలువు తీరిన మూడవ శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఆమె ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలు చాలా బాధపడ్డారని పేర్కొన్నారు. రెండు సార్లు ఓట్లేస్తే గెలిచి ఏర్పాటు చేసిన ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆక్షేపించారు. శాసన మండలి సమావేశాలు ముగింపు అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరిగిందని అన్నారు.
“నిరంకుశ, నిర్భంధ ప్రభుత్వంగా అభివర్ణిస్తూ దూషించారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ఆ పదాలు రికార్డుల్లో నుంచి తొలగించాలని కోరాం. ప్రజల తీర్పు గౌరవిస్తున్నాం. తొలి శాసన మండలి సమావేశాలు ఇవి అని చెప్పారు. మండలిలో బీఆర్ఎస్కు మెజారిటీ ఉంది. సవరణపై ఓటింగ్‌లో మాదే విజయం. అయినా.. కూడా ప్రభుత్వానికి సహరించాలన్న ఉద్దేశంతో ప్రజలకు ఓ సందేశం ఇవ్వాలనుకున్నాం. ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగించాలి. రాష్ట్ర ప్రగతిపై ప్రభుత్వం ఓ రోడ్ మ్యాప్ రూపొందించి ప్రజలకు చెప్పాలి. ఏమైనా నష్టం జరిగే చర్యలు ఉంటే వాటిని అడ్డుకుంటాం. పోరాటాలు చేస్తాం.” అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.