ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కవిత బెయిల్ పిటిషన్‌పై దర్యాప్తు సంస్థల తరఫున లాయర్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఫోన్లలో ఉన్న డేటాను కవిత ఫార్మాట్ చేశారని పేర్కొన్నారు. ఆధారాలు, సాక్ష్యాలు కవిత మాయం చేశారని ఆరోపణలు చేశారు. దర్యాప్తునకు సహకరించడంలేదన్నారు.
ఫోన్ లో డేటా ఎక్కువైనప్పుడు డిలీట్ చేస్తాం.. కానీ, ఫార్మాట్ చేయరని వివరించారు. ఆధారాలను కవిత తారుమారు చేశారన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు సీబీఐ, ఈడీ లాయర్ ఎస్వీ రాజు. అయితే దాదాపు గంటన్నర పాటు వాదనలు విన్న బెంచ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈడీ అధికారులపై సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు మెరిట్స్ లోకి వెళ్లడం లేదని ఆక్షేపించింది. విచారణ పూర్తయి.. చార్జ్ షీట్ కూడా దాఖలైనా కవితను ఈ దశలో ఇంకా జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని పేర్కొంది ధర్మాసనం. సెక్షన్ 45 ప్రకారం.. బెయిల్ పొందేందుకు ఓ మహిళకు అర్హత ఉందని వ్యాఖ్యానించింది. తిరస్కరించాలంటే సరైన కారణం ఉండాలని పేర్కొంది.