మార్కులే ప్రామాణికంగా కొందరు తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తీసుకువస్తుంటారు. కొందరు మందలిస్తూ.. పిల్లల కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తే.. మరికొందరు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ వారిని మానసిక సంఘర్షణకు గురి చేస్తుంటారు. అయితే ఇంకొందరేమో.. నువ్వు చదవకపోతే ఎలా.. నీ భవిష్యత్ ఏమవుతుందోనని భయమేస్తోంది అంటూ వాళ్లు ఒత్తిడికి లోనవుతూ పిల్లలపై మరింత ఒత్తిడి పెంచేస్తుంటారు. ఒక్కోసారి ఇది పరిధి దాటి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది. కేవలం విద్యార్థులే కాదు.. వారి భవిష్యత్ గురించి ఆందోళన చెందుతూ కొంతమంది తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
కుమారుడు పరీక్షలో తప్పాడని ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గాజులరామారంలోని బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నివాసముండే నాగభూషణం, పుష్పజ్యోతి(41) దంపతులకు ఇద్దరు కుమారులు. ఇటీవల ఓ కుమారుడు ఛార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ) పరీక్ష రాశాడు. అందులో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో తల్లి మానసికంగా ఒత్తిడి లోనైంది. కుమారుడి భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్న ఆమె బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ పవన్ తెలిపారు.