ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, హామీలంటూ చేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్నీ మరిచిపోయిందని బీజేపీ ఎంపీ అర్వింద్ కుమార్ అన్నారు. ఏడాదిన్నర పాలనలో పుష్ప, హైడ్రా, మూసీ, హెచ్‌సీయూ మీద పడ్డారు తప్పితే ఇచ్చిన హామీలను అమలు చేయడం మీద లేదని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పరిపాలనా తీరుపై ఎంపీ అర్వింద్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అసమర్థ, అవినీతి, అసత్య ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఆర్థిక క్రమశిక్షణ లేని జీరో పరిపాలన సాగుతోందని.. ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, విద్యా భరోసా కార్డు, చేయూత, ఆరోగ్యశ్రీ, లక్ష రూపాయలు, తులం బంగారం.. ఇలా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ విస్మరించారని విమర్శించారు. రాను రాను సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతోందని అర్వింద్ తెలిపారు. రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైలులో వేస్తే.. రేవంత్ కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు.