కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రావాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అబిడ్స్, ఎల్బీ నగర్, హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా చర్చకు తాను రెడీ అని.. సీఎం రెడీయా అంటూ ఈటల సవాల్ విసిరారు. కేసీఆర్ పతనానికి 9 ఏళ్లు పడితే.. రేవంత్ రెడ్డి పతనానికి 9 నెలలే పట్టిందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలవలేదని.. కేవలం కేసీఆర్‌ను జనం ఓడించారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఇక రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి జనం అవకాశం ఇవ్వరని.. అసలు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చోటే ఉండదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం కడతారని జోస్యం చెప్పారు. ఈసారి తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారం బీజేపీదేనని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.