పాతికేళ్ల తర్వాత జూన్‌లో మూసీ గేట్ల ఎత్తివేత

-

పూర్తిగా వర్షంపైనే ఆధారపడి నిండే మూసీ ప్రాజెక్టు వర్షాకాలంలో కురిసిన వానలకు నిండి.. యాసంగి సీజన్​లో సాగుకు నీటిని అందిస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ ఇది. అయితే పాతికేళ్ల నుంచి జూన్ నెల మొదటి వారంలో మూసీ గేట్లు ఎత్తిన చరిత్ర లేదు. దాదాపు 25 ఏళ్ల తర్వాత జూన్ మొదటి వారంలో మూసీ గేట్లు ఎత్తారు.

ఈ ఏడాది యాసంగి పంటలకు సాగునీరు అందించి కాలువలకు నీటి విడుదల నిలిపివేసినప్పటి నుంచి మూసీ ఎగువప్రాంతాలైన హైదరాబాద్‌ నగరంతో పాటు, మేడ్చల్‌- మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగాం తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిరంతరం వాగులు, వంకల ద్వారా వరదనీరొచ్చి చేరింది. మండువేసవిలో మూసీ ప్రాజెక్టు జలాశయం నీటిమట్టం రోజురోజుకు పెరుగుతూ నిండుకుండలా మారింది.

రిజర్వాయర్‌ నీటిని ఈ ఏడాది ఏప్రిల్‌ పదో తేదీ వరకు ప్రాజెక్టు ప్రధాన, కుడి, ఎడమ కాలువల ఆయకట్టు భూములకు విడుదల చేశారు. నీటి విడుదల ముగిసే వరకు రిజర్వాయర్‌ నీటిమట్టం 622 అడుగుల కనిష్ఠ స్థాయికి తగ్గింది. మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు సోమవారం చేరుకోగానే డ్యామ్‌ క్రస్టుగేటును అధికారులు ఎత్తి దిగువమూసీలోకి నీటిని విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version