హైదరాబాద్ మహానగర వాసులను ప్రతి ఏటా అలరించేందుకు వస్తోంది ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. నుమాయిష్గా పిలుచుకునే ఈ ఎగ్జిబిషన్ నగర ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నగర ప్రజలకు పర్యాటక అనుభూతితోపాటు వినోదాన్ని పంచే ఈ ఎగ్జిబిషన్ నేటి నుంచి నాంపల్లిలో ప్రారంభం కానుంది.
నాంపల్లి మైదానంలో ప్రారంభంకానున్న ఆ ప్రదర్శనను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. సీఎంతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. 45 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఈ పారిశ్రామిక ప్రదర్శనలో దేశం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికులు తమ ఉత్పత్తులను పరిచయం చేయనున్నారు.
ఇందు కోసం 2వేల 4వందల స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రవేశరుసం 40 రూపాయలు ఉంటుందని స్పష్టం చేశారు. పోలీసు శాఖ, అగ్నిమాపక, వైద్యారోగ్య, పురపాలక శాఖల సమన్వయంతో పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టినట్లు వివరించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఎగ్జిబిషన్కు వచ్చే ప్రజలంతా తప్పనిసరిగా మాస్కు ధరించాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.