నూతన సంవత్సరం వేళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సుల్లో తిరిగే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఫలితంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాయితీ పోయి పూర్తి టికెట్ ధరతో ప్రయాణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
కొద్దివారాల క్రితం బస్సుల్లో సీట్లు నిండటం కోసం ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. అయితే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఒక్కసారిగా పెరగడంతో ఇప్పుడు ప్రయాణికులే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఓఆర్ (ఆక్యుపెన్సీ రేషియో) 69 నుంచి 89కి అంటే 20 శాతం పెరిగింది. రద్దీ పెరగడంతో ఆర్టీసీకి డిమాండ్ పెరిగింది. దీంతో ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ఉపసంహరించుకుంది. ఫ్యామిలీ-24, టీ-6 టికెట్ల జారీకి కండక్టర్లకు సమయం పడుతోందని, అందుకే ఈ టికెట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు