వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజ్ ఎదుట క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు కలకలం రేపాయి. ఉదయాన్నే అటుగా వెళ్తున్న కొందరు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం. కాలేజీ ఎదుట పసుపు, కుంకుమలతో పాటు క్షుద్రపూజలకు వినియోగించే సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.దీంతో కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులు సైతం జంకుతున్నారు. అసలు ఈ పని ఎవరు చేశారు? కాలేజీ ఎదుట చేయడానికి కారణాలు ఏమిటి?
కళాశాల ఆవరణలో ముగ్గులు వేసి నిజంగానే క్షుద్రపూజలు జరిపారా? లేదా ఎవరైనా ఆకతాయిలు ఇలా చేసి ఉంటారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు ఈ పని ఎవరు చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. నిజంగానే ఎవరైనా ఇలాంటివి చేసినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వికారాబాద్ పరిధిలో గతంలో కూడా క్షుద్రపూజలు కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనికి గల కారకులను సత్వరమే పట్టుకుని వారికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.