హైదరాబాద్ లో ఉంటూ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానాల కింద యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు, తెలంగాణ ఇంటిలిజెంట్ పోలీసులు మంగళవారం అటు మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్ లో, ఇటు హైదరాబాద్ లో ఏకకాలంలో సోదాలు జరిపారు. అనుమానిత ప్రాంతాలలో జరిపిన ఈ సోదాలలో భూపాల్ లో 11 మంది అరెస్ట్ కాగా.. హైదరాబాద్ లో మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో మరొక నిందితుడు పరారయ్యాడు.
అయితే నగరంలో ఉగ్ర కదలికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆరుగురు ఉగ్రవాదులు హైదరాబాద్ లో పట్టుబడ్డారని.. పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తానని గతంలో ఓవైసీ ప్రకటించారని.. ఉగ్రవాదులకు, రోహింగ్యాలకు మజిలీస్ ఆశ్రయమిస్తుందన్నారు. ఉగ్ర నేత ఓవైసీ కుటుంబానికి చెందిన దక్కన్ కాలేజీలో హెచ్వోడీగా పనిచేస్తున్నాడని ఆరోపించారు బండి సంజయ్.