శాసనసభలు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతికి గడువు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే దీనిపై తాజాగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ స్పందించారు. న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని ఆయన అన్నారు.
శాసనసభలు ఒకటికి రెండు సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవీ తీవ్ర జాప్యానికి గురికావడంపై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఈ అంశంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కేసు విచారణ సందర్భంగా కేంద్ర హోంశాఖ సూచించిన 3 నెలల వ్యవధిని.. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపించిన రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువుగా విధించడం సముచితమని భావించినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. తాజాగా దీనిపై ఉపరాష్ట్రపతి స్పందిస్తూ రాష్ట్రపతికి కోర్టులు గడువు విధించే పరిస్థితులు ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు.