కాంక్రీట్ జంగల్గా మారిన హైదరాబాద్ మహానగరంపై భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. చెట్ల నరికివేత, పట్టణీకరణతో నగరం కాంక్రీటు వనంలా మారి నిప్పు కుంపటిని తలపిస్తోంది. ఇదే విషయాన్ని హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ సంస్థ తాజాగా విడుదల చేసిన పరిశోధన నివేదిక స్పష్టం చేస్తోంది. మార్చిలో నగరవ్యాప్తంగా 7 ప్రాంతాల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైనట్లు ఈ నివేదిక తెలిపింది. ఆ ప్రాంతాలను అర్బన్ హీట్ ఐలాండ్స్‌గా పేర్కొంది.
భూ ఉపగ్రహ, గూగుల్ ఎర్త్‌లోని ఉష్ణోగ్రతల సమాచారాన్ని విశ్లేషించగా హైదరాబాద్ నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి, బీఎన్‌రెడ్డినగర్, మన్సూరాబాద్, పటాన్‌చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, హయత్‌నగర్ ప్రాంతాలు హీట్ ఐలాండ్స్గా నిలిచాయి. ఈ ప్రాంతాల్లో నేల మీద నిలవలేనంతగా భూమి వేడెక్కినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో నేలపై ఉన్న ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలుగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేశారు. క్రమంగా హీట్ ఐలాండ్లు పెరుగుతాయని, చెట్లను పెంచి పచ్చదనాన్ని విస్తరిస్తేగానీ పరిస్థితిని అదుపు చేయలేమని అభిప్రాయపడ్డారు.