ఎమ్మెల్సీ కవితకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆహ్వానం

-

ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రికి ఇటీవలే విదేశీ సదస్సుకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. మరోవైపు తాజాగా ఎమ్మెల్సీ కవితకు కూడా ఓ ప్రఖ్యాత వర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. పదేళ్లలో తెలంగాణలో మారిన స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఈ నెల 30వ తేదీన లండన్‌లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు.

‘డెవలప్‌మెంట్‌-ఎకనామిక్స్‌’ ఇతివృత్తంలో భాగంగా తెలంగాణ మోడల్‌పై ప్రసంగించాలని కోరుతూ.. కవితకు ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ ఆహ్వానం పంపింది. వ్యవసాయ రంగంలో తెలంగాణ పురోగమించిన తీరు, రైతుబంధు పేరిట సీఎం కేసీఆర్‌ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్‌ భగీరథ, వైద్య, విద్యా రంగాల్లో పురోగతి తదితర అంశాలపై కవిత ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం పొందేలా కుల వృత్తులను ప్రోత్సహించడం, అనేక రూపాల్లో గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిపుష్టికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన కార్యక్రమాల గురించి అంతర్జాతీయ వేదికపై ఎమ్మెల్సీ కవిత ప్రసంగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news