పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లభించింది. దీంతో నిర్మాణ పనులు వేగంగా చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల రెండో దశ సాగునీరు నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కమిటీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది.
కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని పర్యావరణ అనుమతుల కమిటీ (ఈఏసీ) గత నెల 24వ తేదీన నిర్వహించిన 49వ సమావేశం మినిట్స్‌ను గురువారం విడుదల చేసింది. ఈ ఎత్తిపోతల పనుల్లో పర్యావరణపరమైన ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని.. దానికి సంబంధించి ఉపశమన చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు అథారిటీని ఈఏసీ ఆదేశించింది. ఆయా చర్యలను నిర్దేశిస్తూ.. ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టు ద్వారా.. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 12.38 లక్షల ఎకరాలకు సాగునీరు, వేల గ్రామాలకు తాగునీరు అందుతాయని 2016లో ప్రభుత్వం తెలిపింది. ఆ ఏడాదిలోనే పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం చేపట్టింది.