తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్ల పర్వం షురూ అయింది. తొలిరోజు పలువురు బీజేపీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు మొత్తం 42 మంది అభ్యర్థులు 48 నామినేషన్లు వేశారు.
మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, మెదక్ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, నాగర్ కర్నూల్‌లో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ నామపత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి తరఫున వారి ప్రతిపాదకులు నామినేషన్ వేయగా, మహబూబ్‌నగర్‌లో ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. మెదక్‌లో 4 నామినేషన్లు దాఖలు కాగా కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరఫున ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నామపత్రాలు దాఖలు చేశారు. అదే విధంగా మరో ఇద్దరు స్వతంత్రులు నామినేషన్ వేశారు.
జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ తరఫున, నల్గొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి తరఫున వారి ప్రతిపాదకులు తొలి రోజు నామినేషన్ వేశారు. చేవెళ్లలో మూడు నామినేషన్లు, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గానికి 4 నామినేషన్ల, ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి ఇద్దరు స్వతంత్రులు , వరంగల్ లోక్‌సభ స్థానానికి మూడు, మహబూబాబాద్ స్థానానికి ఒక నామినేషన్ దాఖలైంది. మొత్తంగా తొలిరోజు 42 మంది అభ్యర్థుల నుంచి 48 నామినేషన్లు దాఖలయ్యాయి.