తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఆ దిశగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం రాష్ట్రానికి వచ్చారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ ఇవాళ సూర్యాపేటలో పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
మరోవైపు ఆదివారం రోజున ప్రచారం మొదలుపెట్టిన పవన్ కల్యాణ్.. హనుమకొండలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. తెలంగాణలో బీసీ సీఎంను చూడాలనే ఆకాంక్షతో బీజేపీతో పొత్తుకు సై అన్నానని తెలిపారు. అవినీతి రహిత తెలంగాణనే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీలో అవినీతి అలవాటైపోయిందన్న పవన్… సాగునీటి ప్రాజెక్టుల్లో పర్సంటేజీలు, కమిషన్లు పోరాటాల తెలంగాణలో జరగటం బాధ కలిగించిందని తెలిపారు. తాను అధికారం కోరుకోవట్లేదని తెలంగాణలో మార్పును చూడాలనుకుంటున్నానని చెప్పారు. ఏ బలం లేకున్నా గుండెబలంతో పోరాడాలన్నది తెలంగాణ నుంచే నేర్చుకున్నట్లు పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు.