విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్న ట్రాఫిక్ ని అధిగమించేందుకు పోచంపల్లి-మన్సూరాబాద్ వరకు ఉన్న పాత రోడ్డు తెరిపించే బాధ్యత నాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హమీ ఇచ్చారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డితో కలిసి ఇవాళ శ్రీ సాయినగర్ కాలనీ వద్ద మూసివేసిన రోడ్డును పరిశీలించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా గతంలో ఉన్న పాత రోడ్డు మ్యాప్ ను ఈటలకు కార్పొరేటర్ చూపించి, రోడ్డును మూసి వేయడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను, ట్రాఫిక్ సమస్యలను ఎంపీకి వివరించారు.
దాదాపు వంద సంవత్సరాలుగా ఉన్న రోడ్డును కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటుతో అధికారులు రోడ్డుకు అడ్డంగా గోడను కట్టి మూసివేశారని తెలిపారు. ప్రజలకు కలుగుతున్న అసౌకర్యంపై దాదాపు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని కొప్పుల నర్సింహారెడ్డి ఎంపీకి వివరించారు. అయినా అధికారులు మాత్రం స్పందించడం లేదని తెలిపారు. రోడ్డు మూసివేతతో ఏర్పడిన సమస్యలను తెలుసుకున్న ఈటల రాజేందర్ క్రిడా, ఫారెస్టు అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. పాత రోడ్డును పునరుద్ధరించి రోడ్డుకు ఇరువైపుల గోడ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ నగరానికి దూరాన్ని తగ్గించడంతో పాటు విజయవాడ జాతీయ రహదారిపైన ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు మన్సూరాబాద్-పోచంపల్లి రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఈ రోడ్డును తెరిపించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.