తెలంగాణలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయం వేడి రాజుకుంది. ఇటీవలే సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు పక్కా అని హామీ ఇచ్చారు. ఇక ఆదివారం రోజున ఆయన ప్రజల్లో నెగిటివిటీ ఉన్న.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఎమ్మెల్యేలను పిలిపించుకుని తీరు మారకపోతే టికెట్ ఇవ్వబోనని హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?
‘సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు రానున్న శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే పోటీ చేస్తాను. వయసు పైబడటంతో ఈసారి నా కుమారుల్లో ఎవరికైనా పోటీ చేసే అవకాశం ఇద్దామని అనుకున్నా.. కానీ ఇటీవల సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పిలిపించి, నన్నే పోటీ చేయాలని సూచించారు. సర్వేలు కూడా నాకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నా కుమారులకు ఏదో ఒక అవకాశం ఇస్తామని సీఎం అన్నారు’ అని పోచారం వివరించారు. ఆదివారం రోజున కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.