టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీతో పలు పరీక్షలు రద్దు చేయడంతో పాటు మరికొన్ని పరీక్షలను వాయిదా వేశారు. వాయిదా వేసిన పరీక్షల రీషెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. అయితే తాజాగా పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లు, సాంకేతిక, ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఈనెలలో నిర్వహించతలపెట్టిన రాతపరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ రీషెడ్యూల్ చేసింది.
ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా (సీబీఆర్‌టీ) సెప్టెంబరు 4, 5, 6, 8, 11 తేదీల్లో సంబంధిత సబ్జెక్టుల వారీగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈనెల 13 నుంచి జరగాల్సిన పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్షలు సెప్టెంబరు 4 నుంచి 8 వరకు జరగనున్నాయి. ఈనెల17న జరగాల్సిన ఫిజికల్ డైరెక్టర్ నియామక పరీక్షను… సెప్టెంబరు 11న నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. ఈ మేరకు కమిషన్ పరీక్షల షెడ్యూలు జారీ చేసింది. పాలిటెక్నిక్ కళాశాలలో 247 లెక్చరర్ పోస్టులకు సాంకేతిక, ఇంటర్ విద్యలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తొలుత కమిషన్ తెలిపింది.