బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో కొంతకాలంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పొంగులేటి కొత్త పార్టీ పెట్టాలని యోచించారు. కానీ దానికి ఇది సరైన సమయం కాదని భావించి వేరే పార్టీలో చేరాలని నిర్ణయించారు. తొలుత బీజేపీ వైపు అడుగులు వేసినా.. కర్ణాటక ఫలితాల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. కన్నడనాట సత్తా చాటిన కాంగ్రెస్ వైపే పొంగులేటి మొగ్గు చూపారు. ఎట్టకేలకు హస్తం పార్టీ చేయందుకునేందుకు రెడీ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే ఇవాళ ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పొంగులేటికి కాంగ్రెస్ కండువా కప్పి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ముఖ్యనేతలు హస్తం గూటికి చేరనున్నారు. వీరితోపాటు పొంగులేటి ముఖ్య అనుచరులు ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 80 మంది ఉన్నారు.