దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణలో భాగంగా దిల్లీ వెళ్లారు. ఇవాళ మరోసారి ఆమె ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కవితకు మద్దతిస్తూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. బీజేపీ ఎన్నికట్రలు పన్నినా.. కవిత నిర్దోషిగా బయటకు వస్తారని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. బ్రేవ్ లేడీ కవిత అంటూ.. బీఆర్ఎస్, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరిట అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు.
మరోవైపు నేడు ఈడీ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె భర్త అనిల్, సోదరుడు, మంత్రి కేటీఆర్, మరో సోదరుడు, ఎంపీ సంతోశ్ కుమార్ దిల్లీ వెళ్లారు. ఈనెల 16వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్నా ఆమె తన స్థానంలో లాయర్‌ను పంపించారు. ఇవాళ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంతో కవిత దిల్లీ వెళ్లారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె ఇవాళ ఈడీ విచారణకు హాజరు అవుతారా లేదా.. అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.