కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్యా స్పందన లభిస్తోంది. ఉదయం 10 గంటల లోపు చేరుకున్న వారి అర్జీ చేసుకునేందుకు అర్హులు అని ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాగైనా తమ సమస్యను సర్కారుకు విన్నవించుకోవాలన్న ఉద్దేశంతో 10 గంటల లోపు వరసలో నిల్చునేందుకు చాలా మంది ప్రజలు అర్ధరాత్రే తమ ఊళ్ల నుంచి నగరానికి బయలుదేరి వస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం తీవ్రమైన చలిని కూడా లేక్క చేయకుండా తెల్లవారుజామున నుంచే బాధితులు ప్రజా భవన్ ఎదుట బారులు తీరారు.
ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు ఇప్పుడైనా పరిష్కారం అవుతాయనే ఉద్దేశంలో వస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇలా తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు ప్రజాభవన్ ఎదుట ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చలి కాలం కావడంతో ప్రజలు గజగజ వణుకుతూనే ప్రజా భవన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే వచ్చినవారికి మౌలిక సదుపాయాల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని అర్జీదారులు కోరుతున్నారు. జిల్లాల నుంచి వచ్చే వారికి ఎక్కడ ఉండాలో తెలియక రోడ్ పైనే పడుకుంటున్నామని ఈ సమస్యను కూడా దృష్టిలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.