యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ఇవాళ పర్యటించారు. ఈ క్రమంలో పోచంపల్లికి ఇండియన్ ఆర్మీకి చెందిన రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో రాష్ట్రపతి వెళ్లారు. అయితే ఈ రెండు హెలికాప్టర్లు అక్కడ ల్యాండింగ్ అవుతున్న సమయంలో పోలీసులు గాలికి ఎగిరిపడ్డారు. దీంతో బందోబస్తులో ఉన్న పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీకి చెయ్యి విరిగింది. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ ముగ్గురిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు చేనేత పరిశ్రమతో గ్రామీణులకు మంచి ఉపాధి దొరుకుతుందని పోచంపల్లి పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సభా వేదికపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తుందన్నారు. పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగిందన్నారు. గ్రామీణ ప్రాంత వృత్తులను కాపాడుకోవాలని చేనేత అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానన్నారు. తమ ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకు వస్తామన్నారు.