రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో సిట్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిట్ దర్యాప్తులో కేవలం ప్రశ్నా పత్రాల లీకేజ్ మాత్రమే కాకుండా.. హైటెక్ మాస్ కాపీయింగ్ జరిగినట్లు తేలడంతో ప్రస్తుతం ఆ అంశంపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగమైన వారిని ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. అయితే తాజాగా ఈ కేసులో సిట్ పోలీసులు ఓ ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసులో ఇప్పటివరకూ అరెస్టయినవారి సంఖ్య 52కు పెరిగింది. నీటిపారుదల శాఖ ఏఈ రమేష్ కుమార్ అలియాస్ రమేష్ హైటెక్ మాస్ కాపీయింగ్‌తో లీకేజ్ కేసును మలుపు తిరిగింది. ఈ ఏడాదిలో నిర్వహించిన ఏఈఈ, డీఏఓ పరీక్షలకు హాజరైన ఏడుగురు అభ్యరులకు రమేష్‌కుమార్ సహకరించాడు. మలక్‌పేట్‌లో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి అక్రమదందా నిర్వహించాడు. ఆ రెండు పరీక్షల్లోనూ అవసరమైన ప్రశ్నపత్రాలను టోలిచౌకిలోని ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ మహబూబ్ ఫోటోలు తీసి….రమేష్ వాట్సాప్ నెంబరకు పంపాడు. ప్రతిఫలంగా 8లక్షలు కమీషన్‌గా తీసుకున్నాడు. ఏఈ రమేష్ బండారం బయటపడ్డాక మహబూబ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తాజాగా సిట్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.