పుష్ప ను అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారు అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ లా తాము ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనుకోవడం లేదని.. బలమైన ప్రతిపక్షం ఉండాలనుకుంటున్నామని చెప్పారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
డిసెంబర్ 04న అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్ద ప్రీమియర్ షో వీక్షించేందుకు విచ్చేయడం.. అక్కడ తొక్కిసలాట జరగడం.. ఆ తరువాత ఆయన అరెస్ట్ కావడం.. చంచల్ గూడ జైలుకు వెళ్లడం.. వెంటనే మధ్యంతర బెయిల్ రావడం అంతా చక చక జరిగిపోయాయి. ఈ వివాదం పై అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ప్రస్తావించగా.. అందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై మండిపడ్డారు. మరోవైపు అల్లు అర్జున్ బెయిల్ పై హైకోర్టు త్వరలోనే తీర్పు ఇవ్వనుంది.