మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరోసారి విమర్శల దాడి చేశారు. సీనియర్ నాయకుడినని చెప్పుకునే తుమ్మల దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ▪తుమ్మలకు ఓటు వేసే వారికే ఓటు ఉండాలా అని ప్రశ్నించిన పువ్వాడ…. కక్షపూరితంగానే మమత కళాశాలల విద్యార్థుల ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశారని విమర్శించారు.
ఖమ్మం జిల్లాలో ఇంటి నంబర్లు లేకుండా ఓట్లు నమోదు చేశారని సోమవారం రోజున కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఈసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దొంగ ఓట్లు నమోదు చేశారంటూ ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, సీఈవో ఇతర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇంటి నంబర్లు లేకుండా నమోదు చేసిన ఓట్లను వెంటనే తొలగించి.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీని లేఖలో కోరారు తుమ్మల. తాజాగా ఈ వ్యవహారంపై పువ్వాడ మండిపడ్డారు.