రాష్ట్రంలో కాంగ్రెస్ బస్సు యాత్ర భూపాలపల్లి నుంచి పెద్దపల్లి జిల్లా వైపునకు కొనసాగుతోంది. ఈ క్రమంలో కాటారం వద్ద కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దొరల తెలంగాణ – ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించామని.. కానీ కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని.. దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందని రాహుల్ ఆరోపించారు. అవినీతి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
“కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు జరపట్లేదు. బీజేపీపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే.. ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులను పోటీ పెట్టి బీజేపీకి సహకరిస్తోంది. బీజేపీ తెచ్చిన ప్రతి చట్టానికి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. రైతు చట్టాలకు కూడా బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉంది.” అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.