హైదరాబాద్​కు మెట్రో, ఎయిర్​పోర్టు ఇచ్చింది కాంగ్రెస్ : రాహుల్ గాంధీ

-

హైదరాబాద్‌కు మెట్రో రైలు ప్రాజెక్టు కేటాయించింది.. అంతర్జాతీయ విమానాశ్రయం ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు మంజూరు చేసింది కూడా కాంగ్రెస్‌ పార్టీనని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్​ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన కార్నర్ మీటింగ్​లో రాహుల్ గాంధీ మాట్లాడారు.

అవినీతిపరుడైన కేసీఆర్‌పై ఒక్క కేసు కూడా లేదని రాహుల్‌గాంధీ అన్నారు. మోదీ సర్కార్ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే.. మళ్లీ దొరల సర్కార్‌ వస్తుందన్న రాహుల్.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే… ప్రజల సర్కార్‌ వస్తుందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని అన్నారు.

“కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. రూ.1200కు పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ను రూ.400కే ఇస్తాం. రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున రైతుభరోసా ఇస్తాం. యువ వికాసం విద్యార్థులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం. మహిళల ఖాతాల్లో ప్రతినెలా రూ.2500 వేస్తాం. పేదల నుంచి కేసీఆర్‌ దోచుకున్న ప్రతి రూపాయి వసూలు చేసి మళ్లీ పేదల జేబులో వేస్తాం. రాష్ట్రంలో 2 శాతం ఓట్లు వచ్చే బీజేపీ.. బీసీ వ్యక్తిని సీఎం ఎలా చేస్తుంది. బీజేపీ బండి 4 టైర్లలో గాలి పోయి మూలకు పడింది.” అని రాహుల్ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news