తెలంగాణలో సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం రోజున (జులై 8వ తేదీ) ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వెల్లడించారు. మిగిలిన జిల్లాలో తేలికపాటి వానలు కురుస్తాయని ప్రకటించారు.
మరోవైపు మంగళవారం రోజు (జులై 9వ తేదీ) సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ అలర్ట్తో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.
మరోవైపు శనివారం రోజున పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో 6.8 సెం.మీటర్లు, ఖానాపూర్ మండలం మంగళవారిపేట5.6, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ5.4, భద్రాద్రి జిల్లా గుండాలలో 4.7, భద్రాచలం 4.1, నిర్మల్‌లో 3.8 సెం.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది.