తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు ఉపశమనం పొందుతుంటే.. పల్లెల్లో రైతులు మాత్రం పంట నష్టంతో విలవిలలాడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కురిసిన వడగళ్ల వానకు ముగ్గురు మృతి చెందడమే గాక.. పలు ప్రాంతాల్లో పంటలను నీటమునిగాయి. మామిడి, నిమ్మ వంటి పంటలు నేలరాలాయి.
తెలంగాణలో పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ప్రారంభమైన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. పంటలకు తీవ్ర నష్టం మిగిల్చింది. ప్రధానంగా సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో తోటలు, పంటలు దెబ్బతిన్నాయి. వికారాబాద్ జిల్లాలో వడగళ్ల వానకు పలుచోట్ల రోడ్లు, పొలాలు తెల్లటి మంచుపొరలతో నిండి కశ్మీర్‌ను తలపించాయి. పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు.
తెలుగు రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో వర్షాలు, వడగళ్లు కురిసే సూచనలు ఉన్నాయని, ఆదివారం కూడా వర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలో జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది.