రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయం ఏంటి..? దానివల్ల లబ్ధిదారులకు కలగబోయే నష్టమేంటో తెలుసుకుందాం.
రేషన్ కార్డులకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో వాస్తవ సభ్యుల వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయనున్నారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో ఎవరెవరున్నారనే విషయం తెలుసుకునేందుకు.. ఒకసారి కుటుంబ సభ్యులు రేషన్ దుకాణానికి వచ్చి నో యువర్ కస్టమర్ పేరిట వేలి ముద్రలు వేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో ప్రతి కార్డుకు సంబంధించిన మృతుల వివరాలు తొలగిపోతాయని చెప్పారు. బియ్యం, సరకుల కోటా కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 11వ తేదీ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది.
ప్రభుత్వ ఆదేశాలతో కొంతమంది లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. చాలా వరకు కుటుంబాల్లో సభ్యులంతా ఉద్యోగరీత్యా.. ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇప్పుడు వేలిముద్రల కోసం వారిని రప్పించడం అనుకున్నంత సులభం కాదని అంటున్నారు. ప్రభుత్వం ఇలాంటి విషయాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.