పర్యావరణ పరిరక్షణలో హైదరాబాద్ దేశంలోనే అగ్రభాగాన ఉందని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆస్కీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచంలో 142వ స్థానంలో ఉందన్నారు. ఇది విశ్వనగరం స్థాయికి ఎదగాలంటే మరింత క్రమశిక్షణతో నడుచుకోవాలని సూచించారు. ఇందుకోసం పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్వహణలో పౌరుల వ్యక్తిగత బాధ్యత పెరగాలని అభిప్రాయపడ్డారు. నాలాల్లో, రోడ్లపై చెత్త, ప్లాస్టిక్ వేయొద్దని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణకు 10 శాతం నిధులు వెచ్చిస్తున్న రాష్ట్రంలో దేశంలో తెలంగాణ మాత్రమేనని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణ రీ-థింక్ హబ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం ఎన్విరాన్మెంటల్ సర్వైలెన్స్ ల్యాబ్‌ను మంత్రి తన చేతుల మీదుగా ఓపెన్ చేశారు. అనంతరం ప్రసంగిస్తూ.. పర్యావరణ పరిరక్షణకు రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అనే ట్రిపుల్ ఆర్ మంత్రను అమలు చేయాలని.. ఇందులో భాగంగా ఇక నుంచి రాష్ట్రంలో ప్రతి శనివారాన్ని రీథింక్ రోజుగా పాటిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.