కేంద్రం తాత్కాలిక వరద సాయం కింద తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. నేడు మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి ఉప్పల్ రోడ్లపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ ఎంపీ పర్యటనకు వస్తే అధికారులు రారా..? అంటూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతానికి చెందిన నేత కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి నోరు లేదా..? అని నిలదీశారు. కేంద్రంతో మాట్లాడి నిధులు, పనులను కిషన్ రెడ్డి చేయించారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ వరదలపై కేంద్రానికి నివేదిక ఇస్తానని తెలిపారు రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి ప్రధానిని కలిసి వెంటనే నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. వరద సాయం తీసుకురావలసిన బాధ్యత కిషన్ రెడ్డి పై ఉందన్నారు రేవంత్ రెడ్డి.