మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితుల అర్ధనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా..? అని ప్రశ్నించారు. తండ్రి కొడుకులు ప్రజల ప్రాణాలు పూచిత పుల్లతో సమానం అన్నట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం వరదలతో అతలాకుతలం అయిందని.. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
కేసీఆర్ కి పార్టీ ఫిరాయింపుల పై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదన్నారు. వరద ముప్పుపై సమీక్షలు చేయకుండా రాజకీయంపై దృష్టి పెట్టారని మండిపడ్డారు. ఇక కేటీఆర్ కి బాత్రూంలు కడగడం తప్ప మరేమీ తెలియదని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేటీఆర్ పుట్టినరోజు పార్టీలలో మునిగిపోయారని ఆరోపించారు.