రేవంత్ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కరలేని పేరు. ఒకప్పుడు తెలంగాణ టిడిపిలో ప్రత్యేక స్థానం ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. కానీ కొన్ని అనూహ్య పరిణామాల వల్ల టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. ఇప్పుడు టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు .
ఇక రేవంత్ వచ్చే ఎన్నికల్లో కొడంగల్ బరిలో దిగి సత్తా చాటాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. అందుకే కొడంగల్ నియోజకవర్గం తెలంగాణ మొత్తం మీద హాట్ సీట్. కర్ణాటక కు దగ్గరలో ఉంటుంది. కొడంగల్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. వెనుకబడిన ప్రాంతమైన కొడంగల్ రాజకీయంగా మాత్రం ఎప్పుడు అప్డేట్ గానే ఉంటుంది. కొడంగల్ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి.
ఇప్పటికీ రెండు సార్లు కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో పరాజయాన్ని పొందారు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా గెలిచారు. ఇక రాబోయే ఎన్నికల్లో కొడంగల్ లో తన జెండా ఎగురవేసి తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తేవాలని రేవంత్ రెడ్డి గట్టిపట్టుతో ఉన్నారు. అధికార పార్టీలోని విభేదాలు, నియోజకవర్గంలోఅభివృద్ధి లేకపోవడం ఇవన్నీ కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలుపుకు అవకాశం ఇస్తున్నాయి.
బిఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం నరేందర్ రెడ్డి పేరే కేసిఆర్ ప్రకటించారు. రేవంత్ రెడ్డికి పోటీ పట్నం నరేందర్ రెడ్డి అయితే రేవంత్ గెలుపు నల్లేరు మీద నడక వంటిదే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నియోజకవర్గ ప్రజలలో రేవంత్ రెడ్డి పై ఉన్న ప్రత్యేక అభిమానమే తనని గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు. నరేందర్ రెడ్డి పై నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత, అధికార పార్టీ నేతలలో సఖ్యత లోపించడం ఇవన్నీ రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే అంశాలే. రాబోయే ఎన్నికల్లో కొడంగల్ స్థానాన్ని సొంతం చేసుకునేది రేవంత్ రెడ్డి అని సర్వేలు, రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు.