తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకు పెరిగిపోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసారి జరగనున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 1994 నుంచి ప్రతి ఎన్నికలోనూ తెలుగు ప్రజలు ఏదో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చారని.. ఈ ఎన్నికల్లో 80-85 సీట్లలో నెగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో హంగ్ వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ విమర్శల వర్షం కురిపించారు. ఆ పార్టీ కక్షపూర్తి ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమ ఆరు గ్యారెంటీలపై ప్రజలను గందరగోళానికి గురి చేయాలని ప్రయత్నిస్తోందని.. తమ ఆరు గ్యారెంటీలు అసాధ్యమని చెబుతున్న కేసీఆర్.. అంతకుమించి ఇస్తామని చెప్పడం ద్వారా తమ హామీల అమలు సాధ్యమేనని చెప్పకనే చెబుతున్నారని రేవంత్ అన్నారు. డిసెంబరు 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు నుంచే ప్రగతిభవన్ పేరును బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రజాపాలన భవన్‌గా మార్చుతామని చెప్పారు. ఇక ప్రజలెవరైనా రావడానికి తలుపులు తెరుస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.