నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఏపీ పోలీసుల దౌర్జన్యంపై తెలంగాణ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కావాలనే పోలింగ్ రోజు ఇలాంటి ఘటనలకు తెరలేపారని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ధికి సీఎం కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కోరారు.
కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్నవాళ్లని.. సమస్యను అర్థం చేసుకోగలిగేవాళ్లని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదిన్నర సంవత్సరాలు అయిందన్న రేవంత్.. నాగార్జున సాగర్ ఎక్కడికీ పోదని.. గేట్లూ ఎక్కడికీ పోవని.. నీళ్లూ అక్కడే ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సీఈవో బాధ్యత తీసుకుని ఆ అంశంపై చర్చించాలని. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగకుండా చూడాలని కోరారు.