ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలమూరులో పర్యటించి పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ పర్యటనపై ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు స్పందించాయి. పనిగట్టుకుని రాష్ట్రానికి వచ్చిన మోదీ.. తెలంగాణకు ఇచ్చిందేం లేదంటూ మండిపడ్డాయి. తాజాగా మరోసారి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మోదీ పర్యటనపై స్పందించారు. పాలమూరులో పర్యటించిన మోదీ రాష్ట్రానికి ఏవేవే విషయాలు చెబుతారని.. తీపికబురు అందిస్తారని ఎదురుచూశామని.. కానీ ఆయన ఉత్తుత్తిగా పర్యటించి వెళ్లిపోయారని రేవంత్ రెడ్డి అన్నారు.
“పాలమూరులో నిన్న ప్రధాని పర్యటించారు. పాలమూరుకు ప్రధాని ఏవైనా ప్రకటిస్తారు అని ఆశించాం. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ప్రకటిస్తారని ఆశించాం. పాలమూరుకు కనీసం ఒక భారీ పరిశ్రమనైనా ప్రకటిస్తారని అనుకున్నాం. బయ్యారం ఉక్కుపై ప్రధాని ప్రకటన చేస్తారని భావించాం. ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వలేదు. పసుపు బోర్డును ఏదో కొత్తగా ఇస్తున్నట్లు ప్రకటించారు. యూపీఏ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సైతం ప్రధాని అమలు చేయలేదు. పాలమూరు ప్రజలకు కిషన్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి.” అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.